నిర్ణయం

“చెప్తుంటే నీక్కాదు! ఇప్పుడు అంత ఖర్చు పెట్టి స్కూటీ తీసుకోవాల్సిన అవసరం ఏముంది?”  ఎంత చెప్తున్నా వినకుండా స్కూటీకి ఆర్డర్ ఇచ్చి అడ్వాన్స్ కట్టిన భార్య మీద కోపంగా అరిచాడు విజయ్.  

“ఇప్పటికే చాలా ఆలస్యం చేశానని రాత్రే అర్థమైంది! స్కూటీ ఖచ్చితంగా కావాలి. స్కూటీ చేతికి వచ్చేవరకు రేపటి నుండి బస్టాండ్ కి వెళ్లి అక్కడి నుండి ఆటో కి వస్తాను.” కోపంతో ఎర్రబడిన భర్త ముఖాన్ని చూస్తుంటే భయం వేస్తున్నా, ధైర్యం చేసి తన నిర్ణయాన్ని తెగేసి చెప్పింది గాయత్రి.  

“అరే రాత్రి ఏదో పొరపాటున అలా జరిగింది! మళ్లీ జరుగుతుందని గ్యారెంటీ ఏంటి? ఇంత వరకు ఎప్పుడూ అలా జరగలేదు కదా.” బార్య ధైర్యం చేస్తుందని ఊహించని విజయ్ కాస్త కోపం తగ్గించుకొని నచ్చ చెప్పినట్లు మాట్లాడుతుంటే, అతని నిర్లక్ష్య వైఖరికి విసుగు చెంది ముందుకు అడుగులు వేసింది గాయత్రి.  

“గాయత్రి నా మాట విను! అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అందుకని ఇలాంటి వృధా ఖర్చులు చేయడం అవసరమా? ఇప్పుడు మనం వీలైనంతగా డబ్బుని ఆదా చేయాలి.”  నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తున్న విజయ్ మాటల్లో రేపటి గురించి ఆలోచన కంటే, తన పట్ల నిర్లక్ష్యం స్పష్టంగా అర్ధం కావడంతో...

“నా నిర్ణయానికి తిరుగులేదు!” అన్నట్లు వెళ్లి బైక్ పక్కన నిలబడింది గాయత్రి.

ఆమె మొండి పట్టుదల చూసి విసుక్కుంటూనే బైక్ స్టార్ట్ చేశాడు విజయ్.  

ముందుకు దూసుకుపోతున్న బైక్ కి విరుద్ధంగా దిగులుగా మారిన ఆమె మనసు గత రాత్రి జరిగిన సంఘటనను జ్ఞాపకం చేస్తుంది.  

*****

గాయత్రి ఒక సచివాలయ ఉద్యోగి! తన గ్రామం నుండి దాదాపు 40 km అవతల ఒక చిన్న పల్లెటూర్లో ఆమెకు   పోస్టింగ్ వచ్చింది.

తన ఊరు నుండి టౌన్ వరకు ఆటోలో వచ్చి, అక్కడి నుండి ఆమె పని చేసే ప్రాంతానికి బస్సులో వెళ్లి, మళ్లీ అక్కడి నుండి వేరే ఆటో లో గ్రామానికి వెళ్లాలి.  

ప్రతిరోజు ఈ ప్రయాణం కష్టంగా ఉన్నా, జీవితం సాఫీగా సాగాలి అంటే ఉద్యోగం చేయక తప్పదు కాబట్టి ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భరించడానికి సిద్ధమైంది గాయత్రి.  

ఉదయాన్నే ఇంటి పని మొత్తం పూర్తి చేసుకుని లంచ్ బాక్స్, టిఫిన్ బాక్స్ రెండు సిద్ధం చేసుకుని బయలుదేరి ఆటోలో టౌనుకు వెళ్తే బస్సు తప్పిపోయి ఆఫీస్ కి ఆలస్యం అవుతుంది అని ఆమె పోరు పెట్టడంతో విజయ్ ఉదయం మాత్రం బస్ ఎక్కించేవాడు.  

సాయంత్రం మాత్రం భర్త చెప్పినట్లుగానే బస్టాండ్ వరకు వెళ్లకుండా రెండు కిలోమీటర్ల ముందు దిగి తమ ఊరు వెళ్లే వైపు ఉండే ఆటో స్టాండ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళేది గాయత్రి.  

ఆ దూరం దాదాపు ఓ 300 మీటర్లే ఉన్నా కూడా రహదారి మొత్తం గాఢాంధకారం అలుముకుని, అడుగు వేయటానికి గుండెలు అదిరేలా ఉంటుంది.  

కానీ బస్టాండ్ కి వెళ్తే మరో పది రూపాయలు ఎక్కువ ఆటో ఛార్జి అవుతుందని చెప్పిన భర్త మాటలు జ్ఞాపకం వచ్చి, గాయత్రి రోజు బస్టాండ్ కంటే ముందే దిగి ఆటో కోసం ఆ చీకట్లో గుండెలు అరచేతుల్లో పెట్టుకొని భయపడుతూనే నడుచుకుంటూ వెళ్ళేది.  

“బావ నాకు సాయంత్రం బస్ దిగి ఆ చీకట్లో ఆటో స్టాండ్ వరకు రావాలంటే చాలా భయంగా ఉంటుంది! ఉదయం రోజు నన్ను తీసుకువెళ్లడం నీకు కష్టంగా ఉంటుంది. నేను స్కూటీ తీసుకుంటాను. లేదా బస్టాండ్ వరకు వెళ్లి అక్కడ నుండి ఆటో కి వస్తాను.” ఉదయం బస్ కోసం తీసుకువెళ్తున్న భర్తతో నెమ్మదిగా తన సమస్యను చెప్పింది గాయత్రి.

“ఇప్పటికీ పది రోజుల నుండి వెళ్తున్నావు! ఏదైనా సమస్య వచ్చిందా? మన వైపు అందరూ మంచివాళ్లే గాయత్రి. నీకెలాంటి సమస్య రాదు. ఇప్పుడు అనవసరమైన ఖర్చులు పెట్టే పని చేయకు.”  గాయత్రీ భయాన్ని పట్టించుకోకుండా ఆమె మాటను కొట్టి పడేసాడు విజయ్.

తర్వాత కూడా ఒంటరిగా చీకట్లో నడవటానికి భయం వేసి పదే పదే భర్తతో అదే విషయాన్ని ప్రస్తావిస్తున్న గాయత్రీని తిట్టి ఆమె నోరు మూయించాడు విజయ్.

ఆమె అదృష్టమో ఏమో తెలియదు కానీ దాదాపు మూడు నెలలు పాటు ఆమెకు ఎలాంటి సమస్య ఎదురుపడలేదు. దాంతో విజయ్ నమ్మకం మరింతగా పెరిగింది.

గ్రామ సంక్షేమం కోసం గ్రామ సభలు నిర్వహిస్తున్న రోజులవి. ఒక రోజు గాయత్రీ పనిచేస్తున్న గ్రామంలో గ్రామ సభ జరగడం వల్ల కలెక్టర్, ఎంపీ ఇంకా అధికారులు అందరూ వచ్చారు. ఫలితంగా సభ పూర్తయి ఆరోజు ఆమె బయలుదేరేసరికి చీకటి పడిపోయింది.  

ఇక గ్రామం నుండి బయటకు వచ్చి బస్సు ఎక్కి తన ఊరు వెళ్లేందుకు నడక మొదలు పెట్టేసరికి రాత్రి 8 అయిపోయింది.  అప్పటికి ఆ ప్రాంతంలో జనసంచారం చాలా వరకు తగ్గిపోయింది.  చుట్టూ గాఢాంధకారం, దూరంగా కనిపిస్తున్న ఆటో స్టాండ్ లో ఊపిరి ఆగిపోయే చివరి క్షణంలో ఉన్న మనిషిలా, మిణుకుమిణుకు మంటూ ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న వీధి బల్బు తప్ప మరే వెలుగు కనిపించలేదు.  ముందుకు అడుగు వెయ్యాలి అంటే భయంతో గుండెల్లో వణుకు మొదలైంది గాయత్రీ కి.  

ఆ సమయంలో ఒంటరిగా వెళ్లలేను అనిపించి దిగిన చోటే ఒకరిద్దరు ఉండడంతో అక్కడే నిలబడి భర్తకు ఫోన్ చేసి,“బావ చాలా చీకటి పడిపోయింది! భయం వేస్తోంది. తీసుకు వెళ్లడానికి రావా?” అని అడుగుతున్న గాయత్రి గొంతులో భయంతో వస్తున్న వణుకు అవతల వారికి కూడా స్పష్టంగా అర్థమవుతుంది.

“ఈ సమయంలో ఆటోలు ఉంటాయి కదా! ఇప్పుడు నేను వచ్చి నిన్ను తీసుకురావాలి అంటే మరింత ఆలస్యం అవుతుంది. అయినా దూరం వెళ్ళాలి అని చెప్పి వచ్చేయకుండా ఎందుకు ఉన్నావు. నేను రాను. ఇప్పుడు రాలేను. జాగ్రత్తగా నువ్వే వచ్చేయ్.” ఆమె భయం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా మాట్లాడి ఫోన్ పెట్టేసాడు విజయ్. అతని మాటలకు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.  

అప్పటికే అక్కడ మిగిలిన ఒకరిద్దరు కూడా వెళ్లిపోవడంతో ఆ చీకటిలో ఉండలేక, ఆటో స్టాండ్ వైపు నెమ్మదిగా నడక మొదలుపెట్టింది.  పక్కనే ఉన్న పొలాల్లో నుండి కీచురాళ్ళ శబ్దం ఆమె గుండెల్లో  బెదురును, అడుగుల్లో వేగాన్ని మరింతగా పెంచింది..

ఇంతలో వెనుక నుండి  వాహనం నెమ్మదిగా వస్తున్నట్లు వెలుగు కనిపించడంతో,   ఆ వెలుగులో ఆటో స్టాండ్ వరకు వెళ్లిపోవచ్చు అనుకుని బెదురు వదిలి వడివడిగా నడవడం మొదలు పెట్టింది గాయత్రి.  

అయితే ఆమె ధైర్యాన్ని ఎక్కువసేపు నిలువనీయలేదు ఆ వెలుగు.  ఆ వ్యాన్ నెమ్మదిగా వచ్చి ఆమె పక్కన ఆగింది.  “ఎక్కడికి వెళ్లాలి మేడం!” డ్రైవర్ బయటకు తలపెట్టి అడిగాడు.  

“చొక్కారపాలెం వెళ్లాలి! వస్తావా అన్నా.” ఊరు వెళ్లడానికి వెంటనే వాహనం దొరికింది అనుకొని సంతోషంగా అడిగింది గాయత్రి.  

“నేను చొక్కర పాలెం వెళ్ళను గాని, నువ్వు వస్తే గంటలో తిరిగి మీ ఊరి దగ్గర దించుతా!” వెకిలిగా నవ్వుతూ అంటున్న అతడి మాటలు వింటూనే కాలు కింద నేల అదిరినట్లుగా ఉలిక్కిపడి అడుగు వెనక్కి వేసింది గాయత్రి.  

ఆమె కళ్ళ ముందు ఎంత ప్రమాదం ఉందో అర్ధమైన క్షణం శరీరమంతా చెమటతో తడిచి, వెన్నులో నుండి వణుకు నిలువెల్లా పాకింది. ఆ క్షణం చుట్టూ ఉన్న గాఢాంధకారం గాని, కీచురాళ్ళ అరుపులు  కాని ఆమెకు భయాన్ని కలిగించలేదు.  

ఎందుకో ఆ అరుపులే ఆ క్షణం ఆమెకు తోడుగా, గాఢాంధకారమే తనను కాపాడే రక్షణ కవచంగా అనిపించి, ప్రమాదం నుండి తప్పించుకోవడానికి వెనక్కి వేసిన అడుగును కదుపుతూ ఆటో స్టాండ్ వైపు పరుగు  మొదలుపెట్టింది.  

కానీ వెనుక వస్తున్న వ్యాన్  వేగంగా ఆమె ముందు అడ్డుగా వచ్చి ఆగింది. “ఒంటరిగా ఎంత దూరం వెళ్తావ్! మేము ఇద్దరమే ఉన్నాం. మా మాట వింటే క్షేమంగా ఇంటికి వెళ్లి పోతావ్. లేదంటే ఏం జరుగుతుందో నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.”

వ్యాన్ దిగుతూ తన వైపు వస్తున్న అతడి దగ్గర నుండి ఆల్కహాల్ వాసన గుప్పున కొట్టడంతో భయంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.  ఆ క్షణం తన జీవితం ముగిసిపోయిన భావం కలిగింది గాయిత్రి కి.  అక్కడి నుండి ఎలా తప్పించుకోవాలో ఆమెకు అర్థం కాలేదు.

వెనక్కి తిరిగి పారిపోవాలి అనుకున్న ఆమె ప్రయత్నాన్ని పసిగట్టి మరొకడు అడ్డుగా వచ్చాడు. “అన్నా, నీ చెల్లైలాంటి దాన్ని అన్నా! వదిలేయండి అన్న.”

చివరి ప్రయత్నంగా ఏడుస్తూ చేతులెత్తి దండం పెడుతున్న గాయత్రి కన్నీళ్లు మద్యం మత్తులో మునిగిన ఆ ఇద్దరి కామాంధులకు కనిపించలేదు అనడానికి గుర్తుగా వాళ్లు మరో రెండు అడుగులు ఆమె వైపు వేశారు.

పరిస్థితి చెయ్యి దాటిపోయింది అని గ్రహించి భయంతో కళ్ళు బైర్లు కమ్మి స్పృహ కోల్పోతాను అనుకునే సమయంలో పక్కనుండి వెళ్తున్న ఆటోలో మనిషిని గుర్తు పట్టిన గాయత్రి శక్తినంతా కూడదీసుకుని,“రఘూ!” అని గట్టిగా పిలిచింది.  గాయత్రి పిలుపు వింటూనే వెళ్తున్న ఆటో వెనక్కి తిరిగింది.  

ఆటో వెనక్కి తిరగడం చూసి ఆ ఇద్దరూ, ఆటోలో మనుషులు ఉండడం గమనించి, వచ్చిన మంచి అవకాశం చేజారిపోయిందనే నిరాశలో గాయత్రి వైపు కోపంగా చూసి వ్యాన్ ఎక్కి పారిపోయారు.  దాంతో ఊపిరి పీల్చుకున్న గాయత్రి పరుగున ఆటో దగ్గరికి వెళ్లింది.

“ఈ సమయంలో ఒంటరిగా ఎందుకు వెళ్తున్నావ్ వదినా! అన్నకు ఫోన్ చేయలేకపోయావా?” ఆమె పక్కనుండి  వెళ్లిన మనుషుల్ని, వ్యాన్ ని చూసి కంగారుగా అడిగాడు ఆటోవాడు.

“మీ అన్న పనిలో ఉన్నాడు రఘు!”  

వణుకుతున్న గాయత్రి శరీరం, ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి, అందరి ముందు ఆమెను అంతకంటే ఎక్కువ అడగలేక పాసింజర్లు దిగిన తర్వాత, నేరుగా ఇంటి దగ్గర దింపి వెళ్లిపోయాడు రఘు.  గాయత్రి ఇంట్లోకి వస్తూనే ఏడుస్తూ విజయ్ తో అంతా చెప్పింది.  

“ఈరోజు చాలా ఆలస్యమైంది కదా అందుకే అలా జరిగింది! రేపటినుండి కొంచెం వేగంగా బయలుదేరితే ఈ సమస్య ఉండదు. ఇప్పటికే ఆలస్యం అయింది వెళ్లి వంట చేయు.” అన్న విజయ్ నిర్లక్ష్యపు మాటలకు, గాయత్రి కి ఒక క్షణం తన భవిష్యత్తు అంధకారంగా కనిపించింది.  

ఆ అంధకారంలో వెలుగు నింపుకోవడం తన చేతుల్లో ఉందని అర్థం చేసుకొని, చివరికి తెగించి ఒక నిర్ణయానికి వచ్చి మరునాడు సెలవు పెట్టి, పని ఉందని చెప్పి విజయ్  ని తీసుకుని నేరుగా బైక్ షో రూమ్ కి వెళ్లి తనకోసం స్కూటీ ఆర్డర్ పెట్టుకుంది.  

********

“ఏంటి అప్పుడే స్కూటీ మీద షికార్లు చేస్తున్నట్టు కలకంటున్నావా? ఇంటికి వచ్చాము దిగు.”  భర్త పిలుపుతో ఆలోచనలో నుండి తేరుకొని కిందకు దిగిన గాయత్రి ఈసారి అతడి మాటలు మనసుకు తీసుకోవాలి అనుకోలేదు.  

క్షణక్షణం భయంతో బ్రతుకుతూ, అతడి మీద ఆధారపడే కంటే ముఖ్యమైన విషయాల్లో సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆ క్షణం నిర్ణయించుకుంది.  

తరువాత విజయ్ మాట్లాడిన మాటలు ఏవి ఆమె మనసు వరకు కాదు కదా, చెవి వరకు కూడా చేరలేదు.  

“నా జీవితానికి నేనే రక్షణ కల్పించుకోవాలి!” అనే నిర్ణయం ఆమె జీవితానికి సరికొత్త బాటలు వేసింది.

సంపుటి 44 · సంచిక 5 · సెప్టెంబర్ – అక్టోబర్ · 30 సెప్టెంబర్, 2026