అమ్మ అంటరానిదైయింది
అవును..
అమ్మ ఇప్పుడు అంటరానిది అయింది.
అండాన్ని పిండంగా మార్చి
మరణపు అంచుకు చేరి
రుధిర ధారలు చిందించి
నన్ను ధరణికి పరిచయం చేసిన
అమ్మ ఇప్పుడు..
ఎందుకో మరి అంటరానిది అయింది.
పొరుగింటి పోరటను..
పదిలంగా దాచి పెట్టి
అనురాగాన్ని రంగరించి
ముద్దను ముద్దు చేసి పెట్టేది.
నువ్వు తిన్నావా అమ్మా అంటే?
నేను తినగా మిగిలిందే పెడుతున్నానని
పచ్చి అబద్దం ఆడేది.
అలాంటి అమ్మ ఎందుకో మరి
అంటరానిది అయింది.
వాక్కులు శరాలై..
మనసుని గాయపరుస్తున్నా..
చేతలు శూలాలై..
తనువుని తూట్లు పొడుస్తున్నా
అప్పుడప్పుడు నాన్న బూటుకాలు
అమ్మ ప్రక్కటెముకుల్ని ముద్దాడుతున్నా..
తనలో ఏంతో అలజడిని నింపుకుని
బయటకి ప్రశాంతగా కనిపించే
కడలిలా అమ్మ కనిపించేది.
అయినా అమ్మ అందరికీ..
షడ్రుచుల విందు భోజనం అయ్యేది.
అందుకే కాబోలు..!
అమ్మ ఇప్పుడు అంటరానిది అయింది.
తనువుని పుండు చేసుకుని
తన కలల్ని కల్లలు చేసుకుని
ఎల్లలెరుగని ప్రేమని
ఎద ఎదకీ పంచేది.
అప్పుడప్పుడు అమ్మ నీలిమేఘమై
భోరుమని కురిసేది.
పైట చెంగులో తడిసేది.
అందుకే అనుకుంటా...
అమ్మ ఇప్పుడు అంటరానిది అయింది.
మల మూత్రాదుల్ని సైతం
ఇంపుగా తీసి మా కంపుని భరిస్తూ
అందరి సేవలో తరించి హరించి పోయింది.
అటువంటి అమ్మ ఇప్పుడు
ముగ్గు బుట్ట వంటి తలతో
ముడతలు తేలిన తనువుతో..
రొచ్చు కంపులో రోగిష్టియై పడి ఉంది.
అయినా అమ్మ ఇప్పుడు ఎవరికి కావాలి..!?
ఆమె రసం పిండిన చెరుకుపిప్పి కదా..!
అందుకే కాబోలు..!
అమ్మ ఇప్పుడు అందరికీ అంటరానిదైయింది.
