నీ బ్రతుకు మహోన్నతం కావాలి తల్లీ

ఓ కుటుంబ మహిళా

నీ పాత్ర మహోన్నతo

అది గుర్తించలేని సమాజమే

ఉంది ప్రస్తుతం

లేడికి లేచిందే పరుగు

అన్న చందాన బ్రతికే నీకు

తెల్లవారి మొదలు పరుండే

చివరి నిమిషం వరకు 

నీవాళ్ళoదరి క్షేమం కోసం

నిరంతర ఆలోచనతో

అలుపెరుగని యంత్రంలా

శ్రమించడo నీకే వచ్చు!

నిండుకుండలా

నిబ్బరంగా ఉండే కుటుంబవనితా

గుర్తింపులేని జీవిలా

నిరంతర గ్రహణం నీబ్రతుకు

కొవ్వొత్తిలా కరగడం

నీకు తెలుసని మాకు తెలుసు

ఇంకా ఎన్నాళ్లు

నీశరీరాన్ని శుష్కింపచేసుకోవడం

గృహమే స్వర్గసీమ..

అది మాత్రమే నేర్చావునువ్వు

అందుకోసం

ఆయుష్షు పణంగా పెట్టడం ధర్మమా

ఎంత వెలుగు నింపినా

నీమెడలో దండ వేయరు

మూలనపడితే

కట్టుకున్నోడు కూడా కనికరించడు!

నీ కుటుంబీకులకు

ప్రేమ పంచుతూ పెంచుతూనే

నీ సహాయకులుగా

మార్చుకునే తీరుతెలుసుకో 

నాజూకు మాటలతో

చిరునవ్వులు పంచుతూనే

నీ కష్టం కొంచెం

పంచుకునే మనుషులను పెంచుకో

అమ్మ పాత్రతో అందలం ఎక్కాననుకుంటే సరా..

నీ ఆరోగ్యరక్షణ నీ చేతుల్లోనే ఉందని తెలుసుకో!!

సంపుటి 44 · సంచిక 5 · సెప్టెంబర్ – అక్టోబర్ · 30 సెప్టెంబర్, 2026