మండూకోపాఖ్యానం
నెల మొదటి రోజులు కావటంతో బ్యాంక్ చాలా రద్దీగా ఉంది, అందునా చీఫ్ అకౌంటెంట్ భార్య డెలివరీ అయ్యిందని పెటర్నటి లీవులో ఉన్నాడు. అదనపు పని భారంతో గత మూడురోజులుగా ఊపిరి సలపని పని.
బ్యాంక్ మేనేజర్ నా సీటు దగ్గరికి వచ్చి, "అభిరామ్ జీ ఆజ్ ఏక్దిన్ సాంబాల్లో, కల్ డిప్యూటేషన్ పే శాలిని మేడం ఆరహీహై" అన్నాడు. అంత చిరాకులోను నా పరిస్థితి గుర్తించి, పని భారం గురించి మాట్లాడటం ఊరటగా అనిపించింది.
ఇంతలో "సార్ టీ" అంటూ అటెండర్ వచ్చాడు, అందుకుంటుండగా చెయ్యి తగిలి, టీ నామీద ఒలికింది. అసలే పని వత్తిడి వలన చిరాగ్గా ఉన్న నేను, అటెండర్ చెంప చెళ్లుమనిపించాను.
అటెండర్ తో పాటు అక్కడున్న స్టాఫ్, కస్టమర్లంతా నిర్ఘాంతపోయారు, మారు మాట్లాడకుండా అటెండర్ వెళ్ళిపోయాడు. పెద్ద గొడవ అవుతుందనుకున్నాను, కానీ ఏమి కాలేదు. కానీ నా మనసు మనసులో లేదు. ఏం చేస్తున్నానో తెలియకుండా పని జరిగిపోతున్నా మనసంతా ఆందోళనగా ఉంది.
మధ్య మధ్యలో కొందర్ స్టాఫ్ మెంబెర్స్ నాదగ్గరకు వచ్చి, "సార్ మంచిపని చేశారు, వాడికెంత తల పొగరండి, అసలెవ్వరిని లెక్క చేయడు." అంటూ ఎప్పటెప్పటివో పాత సంగతులు అలా.. ఇలా అంటూ ఎవరికి వారు చెపుతున్నారు. "మీరేం తగ్గొద్దు సార్, మీకు సపోర్ట్ గా మేముంటాము. ఎంక్వైరీ
పెట్టమనండి వాడి గురించి రైటింగ్ లో ఇస్తాము.." ఇలా నాకు మద్దతు కొనసాగింది. ఇవన్నీ వింటున్న నాకు, నేను చేసింది సరైనదే ఎక్కడా తగ్గొద్దు అనిపించింది. జరిగిన సంఘటనను ఎప్పుడైతే ఇతరుల కోణంలో చూస్తామో మన విచక్షణ మరుగున పడి, వారి అభిప్రాయం ప్రభావితం చేస్తుంది. లేని భేషజం పుట్టుకొస్తుంది.
ఏమైందో తెలియదు కానీ, సాయంత్రానికల్లా సీన్ మారినట్లనిపించింది. "అట్రాసిటీ కేసు పెడతాడట." అని నా కొలీగ్ చెవి కొరికాడు. సాయంత్రం ఒక్కరంటే ఒక్కరు నా దగ్గరకు కూడా రాలేదు.
మనుషుల తీరే అంతా! ఎదుటి వాడు బలహీనుడైతే వాడి తప్పులేకున్నా అందరి నోళ్ళు లేస్తాయి. అదే వాడు బలవంతుడైతే వాడిది తప్పైనా ఎవడిపాపం వాడికి తగలక మానదు దేవుడన్నీ చూస్తున్నాడని సర్దుకుంటారు.
బ్యాంక్ అకౌంట్స్ క్లోజ్ చేసి బయట పడేసరికి ఏడు దాటింది. బైక్ స్టార్ట్ చేశాను, బుర్రనిండా బ్యాంక్ తాలూకా ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి.
ప్రైవేట్ బ్యాంకుల పోటీ పెరిగినప్పటి నుండి, పబ్లిక్ బ్యాంక్ సిబ్బంది పై వత్తిడి పెరిగింది. అఫీషియల్ కాల్స్ మాట్లాడుతున్నా కస్టమర్లు చిరాకు పడి.."గంటల తరబడి ఇక్కడ క్యూలో నిలబడ లేక చస్తున్నాం, మీరేమో ఫోన్లల్లో ఇక ఇకలు పకపకలు." అని ఒకరంటే, "మన బుద్ది తక్కువై ఈ బ్యాంకులో డబ్బులు పెట్టాము., అరే మన డబ్బులు మనం తీసుకోవడానికి ఆధార్ ఉందా? పాన్ కార్డ్ తెచ్చారా? ఈ రోజు క్యాష్ లేదు? క్యాష్ ఇరవై వేలకు మించి ఇవ్వలేము? చెక్ ఉంటేనే హ్యూజ్ అమౌంట్ డ్రా చేయండి.. మన ఖర్మకాక ఏంటండీ?" ఇంకో పెద్దమనిషి ఉపన్యాసం.
మేము ఉద్యోగులమే కదా! రూల్ పోసిషన్ పాటించాలి కదా! ఎవ్వరు మమ్ములను అర్థం చేసుకోరు... ఏదైనా చిరాకుపడి కౌంటర్లో ఎక్కువసార్లు గొడవ జరిగితే, పని చేతకాని వాని క్రింద లెక్క కడతారు... ఆలోచనలు ఆగక ముందే ఇంటికి చేరాను.
ఆ రోజు రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. అసలే ప్రమోషన్ లిస్టులో ఉన్నాను, ఒకవేళ అటెండర్ కంప్లైంట్ చేస్తే ప్రమోషన్ రాకపోగా, ట్రాన్సఫర్ తప్పక పోవచ్చు. తప్పు ఏదైనా అలా అతనిని కొట్టే అధికారం నాకెవరిచ్చారు.? నా కోపం మీద నాకే అసహ్యం వేసింది. జరిగిందేదో జరిగింది, ఇందరు నా వెనక నిలబడతామని చెపుతున్నారు. ఇక ఏదేమైనా లొంగుబాటు ప్రదర్శించ వద్దని గట్టిగా నిర్ణయించుకున్నాను.
అతని నిర్లక్షం కారణంగానే టీ.. ఒలికింది, నా ప్యాంటు షర్టు పాడు చేశాడు, అతని అజాగ్రత్తవల్ల ఆ రోజంతా మరకలు పడిన డ్రెస్తోనే ఉండాల్సి వచ్చింది. అతగాని నిర్లక్షం ఖరీదు గంట బ్యాంక్ టైమ్ వేస్ట్ అయ్యింది. ఇలా సంఘటనను నాకు అనుకూలంగా సమర్దించుకుంటూ, పూర్తిగా అటెండర్ ది తప్పని నిరూపించడానికి కారణాలను వెతుకుతూ నా వాదనకు బలం చేకూర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. గతంలో అతడు చేసిన తప్పులు వెతుకుతున్నాను. కానీ ఎంతగా సమర్థించుకున్నా నా అంతర్మథనంలో నలిగే గిల్టీ ఫీలింగ్ ను మాత్రం అధిగమించలేక పోతున్నాను.
అటెండర్ నామీద కంప్లైంట్ చేసి ఉంటాడా!? చేస్తే మేనేజర్ ఎందుకు సంజాయిషీ కోరలేదు?. బహుశా బ్యాంక్ రద్దీ కారణంగా అడగలేదా? సాయంత్రమైన అడగాలి కదా!? అటెండర్ కూడా ఏమి జరగనట్టు ఎందుకున్నాడు!?. ఈ ఆలోచనలతో నిద్రలోకి జారుకున్నాను.
ఉదయమే నా శ్రీమతి కెవ్వుమని అరచిన కేక విని దిగ్గున లేచాను. ఒక్క గంతులో మంచం దిగి బైటికి వచ్చాను.
"ఏంటి ఏమైంది?." అని నా శ్రీమతిని అడిగాను.
"పాపా..... పాము, పామండి" అని భయంగా చెప్పింది.
"ఏది? ఎక్కడ?" అన్నాను.
చూపుడు వేలితో వీధి గేటు లోపల, కాంపౌండ్ వాల్ దగ్గర, కప్పను నోటితో కరిచి పట్టుకున్న పామును చూపించింది.
పరీక్షగా చూసాను, కప్ప పెద్దదిగా ఉంది, నడుము భాగాన్ని నోటిలో ఇరికించుకుని పట్టుకుంది పాము.
కప్ప విడిపించుకోవడానికి పోరాటం చేస్తుంది, అది జారిపోకుండా పాము ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. పాము తన బలాన్ని కేంద్రీకృతం చేసి నోటినుండి కప్ప జారిపోకుండా పట్టుకుంది. అందుకే అది అక్కడినుండి కదలటం లేదు.
కప్ప నా వైపు జాలిగా చూస్తున్నట్లనిపించింది, దాని గాజు కళ్ళల్లో నీళ్ళు కనిపించాయి. మృత్యు వాకిలిలో నిలబడి పాహిమాం పాహిమాం అంటున్నట్లు అనిపించింది.
పాము నిర్భయంగా తను వేటాడిన కప్పను, ఎట్టి పరిస్థితిలోనూ వదలొద్దనే పట్టుదలతో మెల్లగా దాని ప్రాణాలను కబళించే ప్రయత్నంలో ఉంది.
పాములు పట్టే వాళ్లని పిలిస్తే అనుకున్నాను, కానీ ఫోన్ నెంబర్ లేదు. ఇప్పటికిప్పుడు ఎవరిని అడగాలి?, వాళ్ళు ఎప్పుడొస్తారు? అప్పటి వరకు పాము ఉంటుందా?... ఆలోచనలు పూర్తి కాకముందే..
"ఏవండీ ఏదో ఒకటి చేయండి?" అంటూ నా శ్రీమతి వరండా గుమ్మం దగ్గర నిలబడి, వాటి వైపు నా వైపు మార్చి మార్చి చూసింది.
"ఏం చేద్దాం అన్నాను?"
"ఏం చేయటం ఏంటండీ! రెండు దెబ్బ లేసి పామును చంపక" అంటూనే బారెడు కర్రొకటి తెచ్చి నా చేతికి అందించింది.
"ఉండండి జాగ్రత్త పామును మాత్రమే చంపండి, పాపం కప్ప కడుపుతో ఉన్నట్లుంది, ఆ కప్పను విడిపించండి." అంది.
"ఏం... అన్నాను?"
పాము విషపు పురుగు, వదిలేస్తే మనింట్లోకో పక్కింట్లోకో దూరొచ్చు!... పిల్ల జల్లా ఉంటారు అంది. పామును భయంగా చూస్తూ.. "చూడండి నల్లగా ఎంత పెద్దగా ఉందో? కోడె త్రాచు అనుకుంటా!? అది కరిస్తే ఇంకేమైనా ఉందా?." అంది నోరెళ్ళబెట్టి.
మొత్తానికి కప్పను రక్షించడానికి.."ధరణీ గర్భము దూరుగాక.... దిగ్గజేంద్రముల వెన్కను దాగునేగాక... హర బ్రహ్మాదులు వచ్చినా గయుడిని వదలన్న కృష్ణ పరమాత్మనిలా... మాండూక రక్షణకు నడుం కట్టావన్న మాట." అన్నాను నవ్వుతూ...
"పాపం... కప్పను చూడండి ప్రాణ రక్షణకు అదెంతగా పరితపిస్తుందో!." అంటూ కప్ప వైపు జాలిగా చూసింది.
"హూఁ... వేసెయ్యనా?" అన్నాను.
"జాగ్రత్త చూసి కొట్టండి.. కప్ప జాగ్రత్త, పాములు తప్పించుకుంటే పగ బడతాయట." అంది.
"హాఁ... నిజమేనా!?" అన్నాను.
"నిజమే, ఒకే పాము ఒకడిని పన్నెండు సార్లు కాటు వేసిందని, ఆ మధ్య పేపర్లో చదివాను." అంది.
"హూఁ... అది నిజం కాదని, తరువాత ఇంకో కథనం వచ్చినట్లుంది." అన్నాను.
"ఏమో.... లెండి ఇప్పుడా గోలెందుకు మీరు కానివ్వండి, అదిగో పాము మెల్లగా కదులుతుంది." అంది పామును గమనిస్తూ..
" లుంగీ సవరించుకొని, కర్రను గట్టిగా పట్టుకొని కొంచం దగ్గరగా వెళ్ళాను, కప్ప పాము నోటిలో లేకుంటే పాము దొరికేది కాదు, కానీ ఆహారాన్ని వదల లేక అక్కడే ఉంటుంది.
కప్ప రెండు మూడు నిమిషాలకు ఒకసారి పెనుగులాడుతూ బైట పడే ప్రయత్నం చేస్తుంది. కానీ శక్తి చాలక, ఏమి చేయలేక దీనంగా చూస్తుంది.
ఎలా కొట్టాలి, తలకు కొంచం దూరంలో ఒక్క దెబ్బ గట్టిగా వేస్తే పాము చస్తుందని, కర్ర పైకెత్తాను.
"హూఁ కానివ్వండి ఆలస్యం చేస్తే కప్పకు ముప్పు తప్పదు" అంది మా ఆవిడ ఎలాగైనా కప్పను కాపాడాలని.
మళ్ళీ ఆలోచించాను, గట్టిగా దెబ్బ వేస్తే అది పొరపాటుగా తగిలి కప్పకూడా చావొచ్చు.. ఊఁహు కొట్టడం కంటే, కర్ర ముందు భాగంతో పాము తల వెనుక భాగాన్ని గట్టిగా గోడకు వత్తేస్తే మంచిదని అనిపించింది. అలా చేస్తే కప్ప క్షేమంగా బయట పడుతుంది అనుకున్నాను. వెంటనే కర్రను పాము తల వెనుక భాగంలో పెట్టి బలంతో గట్టిగా గోడకేసి అదిమాను. బలంగా.. ఇంకా బలంగా.. అదిమి పట్టాను. పాము విలవిల లాడుతూ నోరు తెరిచింది. కప్ప చెంగున దూకి బైటికి వచ్చింది. కానీ దాని కాలు విరిగినట్లుంది, మెల్లగా గెంతుతూ.... పోతుంటే అంతా రక్తపు మరకలు పడుతున్నాయి.
మా ఆవిడ కప్పను మెల్లిగా ఓ అట్టా ముక్క మీదకు దొర్లించి బైట వదిలింది.
పామును కదలకుండా అలాగే బలంగా నొక్కుతూ పట్టుకున్నాను. తోకను వడి తిప్పుతూ కర్రను చుట్టుకుంటుంది, కొద్ది సేపయ్యాక దానిలో చలనం తగ్గింది. మెల్లగా కర్రను తీసి బలంగా తలపై ఓ దెబ్బ వేసను, పాము చనిపోయింది. దాన్ని కూడా వీధి కాల్వ పక్కన వేసి, కర్రను కూడా బైట పడేసి ఇంట్లోకి వచ్చాను.
"పొద్దునే ఓ హత్య చేయించావోయి." అన్నాను కుళాయి దగ్గర చేతులు కాళ్ళు కడుక్కుంటూ.
"ఏం పర్వాలేదు లెండి, కప్ప ప్రాణాలు కాపాడిన పుణ్యం మీకే దక్కుతుంది." అంది.
"మరి పాముకు చిక్కిన నోటి దగ్గరి ఆహారం లాగేసిన పాపం." అన్నాను.
" మీరు మరీనూ... అంటూ... లావొక్కింతయు లేదు.... అన్న పోతన గారి పద్యంలో
"ఈశ్వర, కావవే వరద, సంరక్షింపుము, భద్రాత్మకా!" అన్న గజేంద్రుని మొరవిని..
"సిరికిన్ జెప్పడు పద్యంలో.. వివాద ప్రోత్తిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు, గజప్రాణావనోత్సాహియై అన్నాడు కదండి. అర్థం ఏంటంటే.. అక్కడ మొసలికి చిక్కిన గజేంద్రుడు ఆహారమే కావొచ్చు, కానీ ఆపన్నులను కాపాడటమే కర్తవ్యం, అని ఆ దేవదేవుడైన శ్రీపతి సెలవిచ్చాడు కదా! అలాగే, దీనంగా ప్రాణ భిక్ష పెట్టమన్న కప్పను విడిపించి, పామును దండించి, నాపతి కూడా దుష్ట సంహారం చేసి శిష్ట రక్షణ చేశాడు." అంది తన తెలుగు పాండిత్యాన్ని సోదాహరణగా వివరిస్తూ.
"ఐతే నాకేం పాపం అంటుదని అంటావు." అన్నాను.
"ముమ్మాటికి అంటదు." నాది గ్యారంటీ అన్నంత నిబ్బరంగా అంది.
"అయితే మంచిదే." అన్నాను.
"కానీ మా ఊరిలో ఇలా పామును చంపితే, పాపం తగల కుండా ఉండేందుకు, దాని నోట్లో రాగి పైసా పెట్టి కాలబెట్టే వారు అంది. అవన్నీ ఇక్కడ కుదరవులెండి" అంది మళ్ళీ నిట్టూర్చుతూ..
ఇంట్లోకి వెళ్ళి రెడీ అయి ఆఫీసుకు బయలుదేరాను. ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. నిన్నటి సంఘటన మళ్ళీ బుర్రలోదూరి గజిబిజి చేస్తుంది. అన్యమనస్కంగా నడుపుతున్న బండి నా అజాగ్రత్త వలన పక్కనే వస్తున్న ఓ కారు కు తగిలి, కారు సైడ్ అద్దం విరిగింది. నా బండి సైడ్ ఇండికేటర్ డామేజ్ అయ్యింది. క్రింద పడకుండా బ్యాలన్స్ చేసుకున్నాను. ట్రాఫిక్ స్తంభించి జనం గుమికూడారు. కారువాలా సైడ్ అద్దం దించి "ఏయ్ ఎటు చూస్తూ నడుపుతున్నావు, బ్రతకాలని లేదా.?" అని అరిచాడు.
నేను బండిని సరిచేసే పనిలో ఉన్నాను. గుమికూడిన జనం అతడి పై విరుచుకు పడ్డారు. "ఏంటయ్యా! కారుందని పొగరా!? ముందు వెనుక చూడకుండా నడపటమే కాక పైగా దబాయిస్తున్నావా! పెద్ద వెహికిల్ వాడివి చూసుకొని నడపక్కరలేదా!? రోడ్డు మీ బాబుదనుకున్నావా? కొద్దిగైతే అతను బస్సు కింద పడేవాడు, పొద్దున్నే ఎవరి ముఖం చూసి లేచాడు పాపం అదృష్టవంతుడు, ఈ రోజు నీవల్ల నూకలు చెల్లిపోయేవి. ముందు కారు దిగు." అంటూ ఇద్దరు ముగ్గురు గట్టిగా దాభాయించేసరికి, అతగాడు దిగి నా దగ్గరకు వచ్చి "సారి" అని చెప్పాడు. "సారీ.. గీరి కాదు బైక్ డ్యామేజ్ క్రింది ఐదువేల కట్టు, లేదా కారు పక్కన పెట్టు పోలీసులు వస్తారు." అన్నాడు గుంపులో ఇంకొకరు. అతడు మారు మాట్లాడకుండా ఐదువేల నా చేతిలో పెట్టి వెళ్ళి పోయాడు. నేను అందరికీ ధన్యవాదాలు చెప్పి ముందుకు కదిలాను.
జరిగిన దానిలో అతగాని తప్పేమీ లేదు, నా అజాగ్రత్త వల్లనే జరిగింది, కానీ క్కడ అతను పెద్దమనిషి, నేను సాధారణ వ్యక్తిని, పైగా చిన్న వెహికిల్, అందుకే నామీద జనం జాలి చూపించారు. అదే స్టేషన్ దాకా వెళితే అతని పెద్దరికం, హోదా నన్ను దోషినని తేల్చే అవకాశమే ఎక్కువ. కాని, అతడు లౌక్యం తెలిసిన మనిషి, స్టేషన్ దాకా వెళితే అతని ఈగో సంతృప్తి చెందుతుంది, కానీ పది, ఇరవై వేలు ఖర్చు కానిదే స్టేషన్ బయటికి రాలేడు, అందుకే గోటితో పోయేదాన్ని గొడ్డలిదాక తెచ్చుకోవద్దని తగ్గి నెగ్గాడు.
ఈ సంఘటనతో బ్యాంకులో జరిగిన సంఘటనను అన్వయించుకొని చూసాను. నా ఈగో తప్ప అతని తప్పేమిలేదు. తప్పుచేయని కారు పెద్దమనిషి లౌక్యంగా వ్యవహరించి బయటపడ్డాడు. మరి నేను నా తప్పని తెలిసి ఇంకా భీష్మించుకొని సమస్యను జటిలం చేస్తున్నాను, నేను కారువాలలా లౌక్యాన్ని ప్రదర్శిస్తే సమస్యను చాలా తేలికగా పరిష్కరించుకోవచ్చు అనిపించి ఒక నిర్ణయానికి వచ్చాను.
బైక్ దిగి బ్యాంక్ లోనికి వెళ్లగానే సరా సరి మా అటెండ్ దగ్గరకు వెళ్ళి, అందరి ముందు అతడిని క్షమించమని అడిగాను. అతడు బదులుగా నవ్వి "పర్వాలేదు సార్, మీరు పెద్దవారు ఏదైనా చేస్తారు, నాదే తప్పు." అన్నాడు నిష్టూరపడుతూ..
"లేదు.. లేదు.. నీ తప్పేమి లేదు. తప్పు నాదే సారీ అన్నాను.." అతడి రెండుచేతులు నా చేతుల్లోకి తీసుకుంటూ.., అతడు ఏమి మాట్లాడలేదు, బ్యాంక్ మేనేజర్ దగ్గరకు వెళ్ళి తన కంప్లైంట్ వాపస్ తీసుకున్నాడు.
నా కొలీగ్స్ సారీ అని నేను చెప్పడాన్ని జీర్ణించుకోలేనట్లు ముఖాలు చిట్లించారు. కానీ అట్రాసిటీ కేసు అన్నప్పుడు ఈ ముఖాలన్ని చాటేసినవారే కదా అనుకున్నాను.
నా సిన్సియారిటి, వర్క్ ప్రెషర్ మేనేజర్ కూడా అర్ధం చేసుకున్నట్లున్నాడు. అందుకే అటెండర్ ను ఎంకరేజ్ చేయకుండా ఏదో సర్ది చెప్పిఉంటాడు అనుకున్నాను.
"అభిరామ్ జీ ఆప్నే అచ్చా కామ్ కియా, ఓహ్ కల్హీ కంప్లైంట్ దియాతా, మై ఆజ్ బాత్ కరింగే బోల్కర్ అటెండర్ కో సంజాయా తా!" అన్నాడు.
"జీ.. సర్... థాంక్యూ"అని చెప్పి, నా సీట్ దగ్గరకు నడిచాను.
కప్ప సంఘటన, కార్ యాక్సిడెంట్ జరగకుంటే నాలో మార్పు వచ్చేది కాదు, నాలా... నేను ఆలోచించే వాడిని కాదు. మన జీవితంలో జరిగే సంఘటనలను తరచి చూస్తే, మనం ఎదుర్కునే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అనిపించింది.
సంఘటన జరిగినప్పుడు తప్పో, ఒప్పో జడ్జి చేయటంలో మనకన్నా గొప్పవాళ్ళు ఉండరు. అహానికి పోయో, పుల్లారావుల మాటలు వినో, వాడెంత నా ముందనే అహంకారంతో విచక్షణ కోల్పోయి ప్రవర్తించి సమస్యను పెద్దది చేయటంకంటే, నిజాయితీగా మన తప్పు తెలుసుకొని, సందర్భోచితంగా ప్రవర్తిస్తే, సమస్య తేలికగా పరిష్కారం అవుతుంది. మంది మాటలు వింటే నష్టపోయేది మనమే.
ఎదుటి వారిని క్షమించమని అడగటం కష్టంగానే ఉంటుంది, కానీ ఈ ఒక్క మాట ఎన్నో అపార్ధాలను తొలగించి బంధాలను నిలబెడుతుంది. సమస్య వచ్చినప్పుడు ఎదుటివారి తప్పులు వెతకటం కాదు, మన తప్పేంటో తెలుసుకొని ప్రవర్తించాలి అనుకున్నాను. బహుశా కప్పను కాపాడిన పుణ్యం నన్నిలా కాపాడిందేమో! అనిపించింది.
ఆ మరునాడు నాకు ప్రమోషన్ లెటర్ వచ్చింది. అందరికన్నా ముందు, మా అటెండర్ నా దగ్గరకు వచ్చి శుభాకాంక్షలు చెప్పాడు. అతడిని గట్టిగా ఆలింగనం చేసుకొని ధన్యవాదాలు చెప్పాను.
అటెండర్ కు డబ్బులిచ్చి రాజీ పడ్డానని, మేనేజర్ కు లంచం ఇచ్చి ప్రమోషన్ తెచ్చుకున్నానని మా ఆఫీసులో చెవులు కొరుక్కున్నారు.
లోకంతీరoతే కదా!
కానీ.... నేను చెప్పిన ఒక్క సారి, మా అటెండర్ కు, మా మేనేజర్ కు నా మీద మరింత గౌరవాన్ని కలిగించాయని, అందుకే వారు నన్ను మనస్పూర్తిగా అభిమానిస్తున్నారని అర్థం అయ్యింది.
.... సమాప్తం....
